విద్య–వైద్య రంగాలకే ప్రథమ ప్రాధాన్యం
ఆసుపత్రుల పరిశుభ్రంగా ఉంచాలి
ఖమ్మం నగర జీవన ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి
త్వరలో మరో 2,500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల
బాలాజీ నగర్ అర్బన్ పీహెచ్‌సీ ప్రారంభం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం నగర 4వ డివిజన్ బాలాజీ నగర్‌లో రూ.2.43 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలతో వైద్య సిబ్బంది ప్రేమాభిమానాలతో వ్యవహరించాలని సూచించారు. వైద్య సిబ్బంది మంచి ప్రవర్తనతోనే రోగి బాధ సగం నయమవుతుందని వ్యాఖ్యానించారు.
ఆసుపత్రి పరిసరాల్లో పచ్చని మొక్కలు పెంచి, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వైద్య శాఖకు కేటాయించిన నిధులతో పాటు అవసరమైతే కలెక్టర్, కమిషనర్ ద్వారా అదనపు నిధులు సమకూర్చి పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

అవసరమైతే ప్రత్యేక నిధులు
ఆసుపత్రి అవసరాలకు అవసరమైతే ప్రజాప్రతినిధులు, మంత్రుల ద్వారా ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న సిబ్బందిని అర్బన్ హెల్త్ సెంటర్లకు వినియోగించుకోవాలని, కొత్త పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు పంపితే చర్చించి ఆమోదింపజేస్తానన్నారు. మంచి విద్య, మెరుగైన వైద్య సదుపాయాలతో ఖమ్మాన్ని ప్రశాంత నగరంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య–వైద్య రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. ఇప్పటికే ఖమ్మం నగరంలో అర్హులైన పేదలకు 2,200 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని, త్వరలో మరో 2,500 ఇండ్ల మంజూరుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. రూ.13 వేల కోట్లతో రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, పేదలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో 6,000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశానని, పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేసి నిర్వాసిత పేదలకు కేటాయించామని తెలిపారు.
ఖమ్మం మార్కెట్ ప్రాంతంలో రోడ్డుపై నివసిస్తున్న 28 పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి రోడ్డు విస్తరణ చేపట్టామని మంత్రి తెలిపారు. రోడ్డు విస్తరణలో ఎవరికైనా భవనాలు కోల్పోతే పది రెట్ల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో అక్రమ గుడిసెలు వేయడానికి అధికారులు అనుమతించవద్దని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ… రూ.2.43 కోట్లతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్‌ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కేంద్రం ద్వారా డివిజన్ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉచితంగా నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. చిన్న చిన్న జ్వరాలు, రక్త పరీక్షల కోసం జనరల్ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని, హెల్త్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. గర్భిణీలకు 100 శాతం ఏఎన్‌సీ చెకప్‌లు, ప్రసవాలు, శిశువులకు టీకాలు ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రామారావు, కార్పొరేటర్ డి. జ్యోతి రెడ్డి, ఆర్డీవో నర్సింహారావు, మునిసిపల్ ఈఈ కృష్ణలాల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


