*ఇంచర్లలో సిద్ధమవుతున్న ఎకో పార్కు
*ములుగు జిల్లా పర్యాటకానికి కొత్త ఊతం
*163 ఎకరాల్లో అభివృద్ధి.. పచ్చని చెట్లు, జలాశయాల హరివిల్లు
*ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే జోన్, వాకింగ్ పాత్‌లు, మేడిటేషన్ జోన్‌లు
*జీవవైవిధ్యంపై అవగాహన కలిగించేలా ప్రత్యేక ప్రదర్శనలకు ఏర్పాట్లు
*2 కోట్లతో కొనసాగుతున్న పనులు..
దిశ, ములుగు : తెలంగాణ పర్యాటక రంగంలో మరో అద్భుతమైన ఆహ్లాదక ప్రదేశంగా ములుగు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్ పర్యాటకులకు కొత్త ఆహ్వానంగా మారుతోంది. ఇప్పటికే రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, బోగత జలపాతం, ఏటూరునాగారం అభయారణ్యాలతో పర్యాటక జిల్లాగా నిలిచిన ములుగు, ఇప్పుడు ఇంచర్ల గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్ తో మరింత పర్యాటక ప్రాధాన్యం సంతరించుకోనుంది.
ఎకో పార్క్ ప్రత్యేకతలు….
ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో 163 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎకో పార్క్ ప్రత్యేక ఆకర్షణలతో పర్యాటకులను రప్పించనుంది. ప్రకృతి ఒడిలో సేదతీరేలా రూపొందించిన ఈ పార్క్‌లో పర్యాటకుల కోసం పలు వసతులను ఏర్పాటు చేస్తున్నారు. అరుదైన ఔషధ గుణాలు గల మొక్కలు, పండ్ల చెట్లు, పూల చెట్లు, చెట్ల కింద విశ్రాంతి కోసం పగోడాలు, సహజ సిద్ధన్న పారే జలవనరులను మెరుగుపరిచే చెక్ డ్యామ్‌లు, చెక్‌వాల్స్, వాకింగ్ ట్రాక్స్, నీటి పక్కన పంచవటిలాంటి విహార మార్గాలు ఇలా ప్రకృతి రమణీయతను ఉట్టిపడేలా ఎకో పార్క్ నిర్మాణం జరుగుతుంది.
ఆధునికత, సహజత్వానికి మేళవింపు..!
ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ పరిధిలో రెండు కోట్లతో నిర్మిస్తున్న ఎకో పార్క్ పర్యాటకులను మాత్రమే కాకుండా పిల్లలకు, యూత్‌కు, ప్రకృతి ప్రేమికులకు విశేషంగా ఆకర్షణగా నిలవనుంది. ప్రత్యేక ఆకర్షణగా ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే జోన్, వాకింగ్ పాత్‌లు, మేడిటేషన్ జోన్‌లు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ లో అడవుల విలువ, చెట్ల ప్రాముఖ్యత, జీవవైవిధ్యంపై అవగాహన కలిగించేలా ప్రత్యేక ప్రదర్శనలు ఉండనున్నాయి.
ములుగు జిల్లాకు మరో మైలురాయి..
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా ములుగు జిల్లాలో ఈ ఎకోపార్క్ నిర్మాణం మరో మైలురాయిగా నిలవనుంది. అడవులు, జలపాతాలు ఇప్పటికే ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటే ప్రకృతి అందాలు ఉట్టిపడేలా నిర్మించిన ఎకో పార్క్ ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా మారుతోంది. పచ్చదనం, ప్రశాంతత కోరే ప్రతి ఒక్కరి ప్రయాణం ములుగు జిల్లా వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో సైతం మరింత నిధులతో ఎకో పార్క్ అందాలను రెట్టింపు చేసే అవకాశాలున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఈనెల 15న దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా ఎకోపార్క్ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ప్రకృతిని పరిచయం చేయడమే లక్ష్యం : డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్
ఎకో పార్క్ నిర్మాణానికి సుమారు రూ.2 కోట్లు కేటాయించి ప్రకృతిని అందరికీ పరిచయం చేసేందుకు, పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి చేసి ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదకర వాతావరణ ఇచ్చేలా ఈ ఎకోపార్క్ రూపుదిద్దుకుంటోంది. ప్రతి పర్యాటకుడు ప్రకృతి గొప్పతనాన్ని అనుభవించేలా తీర్చిదిద్దుతున్నాం.ఎకోపార్క్ లో నిర్మించబోయే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ జీవవైవిద్యాన్ని , ప్రకృతి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా రూపొందిస్తున్నాం.


