ఈసీ నిర్ణయం అభ్యంతరకరం
కీలుబొమ్మగా ఎన్నికల కమిషన్
గిరిజన కుంభమేళాను విస్మరించడం బాధాకరం
పండుగ వేళ ఎన్నికల ప్రక్రియ సరికాదు
మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : మేడారం మహా జాతర రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను ప్రశ్నిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ … తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. అయితే మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర జరుగుతున్న రోజుల్లోనే ఈ ప్రక్రియ నిర్వహించడం గిరిజనుల ఆత్మగౌరవానికి విఘాతం అని మండిపడ్డారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం జాతరకు ఐదు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారని ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళా తేదీలు ముందుగానే ప్రకటించి ఉన్నప్పటికీ వాటిని విస్మరించి ఎన్నికల ప్రక్రియ ఖరారు చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం గిరిజనులపై చిన్నచూపు చూపడమేనని అన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరి కోసం ఎన్నికలు నిర్వహిస్తోందని ప్రశ్నించిన ఆయన మతసామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను పక్కనపెట్టి అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతర సమయంలో ప్రజలంతా అమ్మవార్ల దర్శనంలో ఉంటే నామినేషన్లు ఎలా వేయగలరని ప్రశ్నించారు. జాతర ముగిసిన తరువాతే షెడ్యూల్ ప్రకటించాల్సిందని లేకుంటే కక్షపూరిత నిర్ణయమనే అనుమానాలు బలపడతాయని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలుబొమ్మలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. గిరిజనులు, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ షెడ్యూల్ రూపొందించారనే అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇకనైనా ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి రాబోయే ఎన్నికలను పండుగల సమయంలో నిర్వహించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం దెబ్బతినేలా వ్యవహరించవద్దని ప్రతి ఒక్కరికీ పోటీ చేసే హక్కు కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.


