మేడారంలో ముందస్తు మొక్కులు
లక్షల్లో తరలివచ్చిన భక్తులు
జంపన్నవాగులో వేలాది మంది పుణ్యస్నానాలు
వాహనాలతో కిక్కిరిసిన రహదారులు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో శుక్రవారం భక్తుల సందడి ఉప్పొంగింది. ఆదివాసీ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న నేపథ్యంలో, బాక్సింగ్ డే సందర్భంగా సెలవు దినం కావడంతో ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. ఉదయం నుంచే మేడారం వెళ్లే రహదారులన్నీ వాహనాల రద్దీతో నిండిపోయాయి. భక్తులు ముందుగా ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మను దర్శించుకుని, అనంతరం మేడారం చేరుకుని జంపన్నవాగులో కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించారు. పసుపు, కుంకుమ, చీరలు, ముడుపులు, బంగారంతో అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించారు.

వనభోజనాలతో పండుగ వాతావరణం
అమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కిందకు చేరుకుని వనభోజనాలు చేశారు. సాయంత్రం వేళ తిరుగు ప్రయాణం అయ్యారు. శుక్రవారం ఒక్కరోజే లక్షల్లో భక్తులు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నట్లు సమాచారం. శుక్రవారం సెలవు కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో మేడారం మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెడ్డిగూడెం నుంచి మేడారం వరకు సీసీ రోడ్డు పనులు జరుగుతుండటంతో ఒకే వైపు వాహనాల రాకపోకలు కొనసాగాయి. దీంతో దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ సమాచారం అందుకున్న ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, కలెక్టర్ దివాకర స్వయంగా ద్విచక్ర వాహనంపై సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. వారి చొరవతో ట్రాఫిక్ సాఫీగా మారడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.



