కొమ్మాల జాతరపై డేగ కన్ను
360 డిగ్రీల నిఘాతో 100 సీసీ కెమెరాలు
ఇద్దరు ఏసీపీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలతో పర్యవేక్షణ
జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు శాఖ
కాకతీయ, గీసుగొండ : రేపటి నుంచి ప్రారంభమయ్యే కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి జాతరపై డేగ కన్ను వేశారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ ఆదేశాల మేరకు, డీసీపీ ఈస్ట్ జోన్ అంకిత్ కుమార్ పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు. జాతర భద్రత కోసం ఇద్దరు ఏసీపీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 230 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 257 మంది సిబ్బందిని నియమించారు. జాతర ప్రాంగణంలో దాదాపు 100 సీసీ కెమెరాలు, 360 డిగ్రీల కెమెరాలు అమర్చి ప్రతి కదలికపై నిఘా ఉంచుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి సర్వైలెన్స్ బృందాలను రంగంలోకి దింపారు. దొంగతనాలు, అనుమానాస్పద కదలికలు అరికట్టేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలు పనిచేస్తున్నాయి.
ట్రాఫిక్ మళ్లింపు
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్చి 3 సాయంత్రం నుంచి మార్చి 4 రాత్రి వరకు వరంగల్–నర్సంపేట ప్రధాన మార్గంలో వాహనాలను మచ్చాపూర్, పల్లరిగూడ, మొండ్రాయి, కొత్తపల్లి, ఉప్పరపల్లి, కోనాపురం, చెన్నారావుపేట మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. ప్రయాణికులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంబులెన్స్‌లు, ఫైర్ వాహనాలు సిద్ధంగా ఉంచారు. రెవెన్యూ, మెడికల్, ఎండోమెంట్, విద్యుత్ శాఖల సమన్వయంతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రభ బండ్ల నిర్వాహకులకు ముందస్తు నోటీసులు జారీ చేసి శాంతిభద్రతలకు భంగం కలగకుండా హెచ్చరించారు.


