రామప్ప ఆలయానికి నెదర్లాండ్ దంపతులు
కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా పాలంపేట రామప్ప దేవాలయం విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా నెదర్లాండ్‌కు చెందిన పర్యాటకులు జోహన్, హలేన్ దంపతులు రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయానికి చేరుకున్న విదేశీ అతిథులు పూజలు నిర్వహించగా, అర్చకులు హరిష్ శర్మ, ఉమా శంకర్ తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాలయ చరిత్ర, కట్టడ నిర్మాణ శైలి, శిల్పకళ ప్రాముఖ్యతను టూరిజం గైడ్ విజయ్ కుమార్ విపులంగా వివరించారు. సందర్శన సందర్భంగా జోహన్–హలేన్ దంపతులు మాట్లాడుతూ గ్రేట్ ఆర్కిటెక్చర్… బ్యూటిఫుల్ టెంపుల్ రామప్ప అంటూ దేవాలయ నిర్మాణ సౌందర్యాన్ని కొనియాడారు. తరువాత రామప్ప చెరువును సందర్శించిన వారు బోటింగ్ చేస్తూ ప్రకృతి సోయగాలను ఆస్వాదించారు. వారి వెంట దేవాదాయ, టూరిజం, పురావస్తు శాఖల సిబ్బంది, టూరిస్టు పోలీస్ శ్రీనివాస్, అరుణ్, శ్రీకాంత్, దశరత్, బద్రు తదితరులు ఉన్నారు.


