స్కూల్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్
విద్యార్థుల భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి
పెనుబల్లి ఘటన నేపథ్యంలో తనిఖీలు
కాకతీయ, కూసుమంచి : విద్యార్థుల భద్రత దృష్ట్యా కూసుమంచి మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సు డ్రైవర్లకు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అదనపు ఎస్‌ఐ దివ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. పెనుబల్లి మండలంలో శుక్రవారం అదుపుతప్పి కాలువలో పడిపోయిన స్కూల్ బస్సు ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ దివ్య తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు భద్రంగా తీసుకెళ్లి, క్షేమంగా ఇంటికి చేర్చుతారని నమ్మకంతో స్కూల్ బస్సులను ఆశ్రయిస్తారని, ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదన్నారు.
ఫిట్నెస్, డ్రైవర్ బాధ్యత తప్పనిసరి
స్కూల్ యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్‌పై క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, డ్రైవర్లకు మద్యం సేవించి వాహనాలు నడపరాదని కఠినంగా సూచనలు ఇవ్వాలని తెలిపారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ బచ్చలకూరి వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సాంసన్, కానిస్టేబుళ్లు కిషోర్, నాగరాజు, శోభన్ తదితరులు పాల్గొన్నారు.


