116 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అక్రమాలపై పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. బుధవారం నిర్వహించిన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్‌లో బహిరంగ మద్యం సేవించిన 61 మంది, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన 55 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా శాంతి భద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు తెలిపారు.
బహిరంగ మద్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో లైటింగ్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో పటిష్టమైన పెట్రోలింగ్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రోజూ వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌లు కొనసాగుతాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకుని రద్దు కోసం రవాణా శాఖకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ మహేష్ బి. గితే విజ్ఞప్తి చేశారు.


