హైదరాబాద్ శివార్లలో డ్రగ్ పార్టీ
మొయినాబాద్ మండలంలో ఓ ఫాం హౌస్‌లో పార్టీ
పాల్గొన్నవారిలో ఎక్కువ మంది మైనర్లే
గంజాయి తీసుకున్నట్లుగా గుర్తింపు.. అనుమతిలేకుండానే విదేశీ మద్యం
కాకతీయ, క్రైం బ్యూరో : హైదరాబాద్ నగర శివారుల్లో మరోసారి డ్రగ్స్ పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ డ్రంగ్ పార్టీలో పాల్గొన్నవారంత కూడా మైనర్లే కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫాం ద్వారా పరిచయమైన వారంతా కూడా రహస్యంగా ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు పార్టీపై దాడి చేసి.. మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామం సమీపంలోని చెర్రీ ఓక్స్ ఫాంహౌస్‌లో ఈ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అక్కడ అకస్మాత్తుగా దాడి చేశారు. దాడి సమయంలో యువత గంజాయి, మద్యం సేవిస్తూ మత్తులో మునిగిపోయినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకోగా.. ఇద్దరు మైనర్లకు డ్రగ్ టెస్టులో గంజాయి పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. దాడి సమయంలో 8 విదేశీ మద్యం బాటిళ్లను, గంజాయి శేషాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అదేవిధంగా పార్టీని ప్లాన్ చేసిన ఆరుగురు నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. పార్టీలో సుమారు 50 మంది మైనర్లు పాల్గొనగా.. కొందరు నగరంలోని ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులుగా చెబుతున్నారు.


