డ్రైవర్ల కంటిచూపే ప్రయాణ భద్రతకు కీలకం
కమిషనర్ గౌష్ ఆలం
గంగాధరలో ఉచిత కంటి వైద్య శిబిరం డ్రైవర్ల నుంచి విశేష స్పందన
కాకతీయ, కరీంనగర్/గంగాధర : రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటిచూపు అత్యంత కీలకమని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో భాగంగా గంగాధర మండలం మధురానగర్ గ్రామంలోని వాస గార్డెన్స్‌లో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కమిషనర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు తమ ఆరోగ్యంపై, ముఖ్యంగా కంటి చూపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. సరైన చూపు లేకపోవడం వల్ల ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయని, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమతో పాటు ప్రయాణికుల ప్రాణాలను కూడా రక్షించవచ్చన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
ఉదయం ప్రారంభమైన ఈ శిబిరానికి ఆటో, లారీ, కార్ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిపుణులైన వైద్యులు డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందజేశారు. అలాగే తగిన జాగ్రత్తలు, సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్, మోటార్ వాహన పరిశీలకులు రవికుమార్, రజిని, ఎంపీడీవో రాము, తహశీల్దార్ రజిత పాల్గొన్నారు. గంగాధర, చొప్పదండి పరిధిలోని పోలీస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


