రూ.100కి కారు కలలు…
బంపర్ డ్రా మోసం బట్టబయలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రూ.100 పెట్టండి… కారు గెలుచుకోండి అంటూ అమాయక ప్రజలను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన గంగాధర మండలంలో వెలుగుచూసింది. గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో మదీనా మటన్ సెంటర్ నిర్వాహకుడు మహమ్మద్ సాదుల్లా తన దుకాణం పేరుతో ‘బంపర్ లక్కీ డ్రా’ నిర్వహిస్తూ ఒక్కో కూపన్కు రూ.100 వసూలు చేశాడు. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా కారు, రెండో బహుమతిగా మేక, మూడో బహుమతిగా ఫ్రిజ్ ఇస్తామని ప్రచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆకర్షణీయ హామీలతో పలువురిని నమ్మించి కూపన్లు విక్రయిస్తూ డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో లక్కీ డ్రా నిర్వహణకు సరైన అనుమతులు లేకపోవడం, బహుమతుల పంపిణీపై స్పష్టత లేకపోవడం బయటపడటంతో ఇది మోసపూరిత చర్యగా నిర్ధారించారు. ఈ మేరకు మహమ్మద్ సాదుల్లాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. ఇలాంటి బంపర్ ఆఫర్లు, లక్కీ డ్రాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


