- లాటరీ తీసి షాపులను ఎంపిక చేసిన కలెక్టర్లు
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 287 షాపులకు ఎంపిక
- డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సులతో దుకాణాలు ప్రారంభం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 287 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో షాపులకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు 2025–2027 లైసెన్స్ కాలానికి సంబంధించిన ఏ4 మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా కార్యక్రమాలు సోమవారం పారదర్శకంగా జరిగాయి. జిల్లా కలెక్టర్లు, అధికారులు స్వయంగా పర్యవేక్షణ చేయగా దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపులు చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో డ్రా జరిగింది. జిల్లాలో మొత్తం 94 మద్యం దుకాణాలకు 2,730 దరఖాస్తులు వచ్చాయి. రిజర్వేషన్ ప్రకారం గౌడ వర్గానికి 17, ఎస్సీలకు 9 షాపులు కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త లైసెన్సులతో షాపులు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు.
జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో..!
జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్స్లో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సమక్షంలో డ్రా జరిగింది. 71 మద్యం దుకాణాలకు 1,966 దరఖాస్తులు అందాయి. వాటిలో ఎస్సీ వర్గానికి 8, గౌడ వర్గానికి 14, ఓపెన్ కేటగిరీలో 49 షాపులు కేటాయించారు. అలాగే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పెద్దపల్లిలోని బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ ఆధ్వర్యంలో లాటరీ డ్రా జరిగింది. జిల్లాలోని 74 షాపులకు1,507 దరఖాస్తులు అందాయి. గౌడ వర్గానికి 13, ఎస్సీ వర్గానికి 8 షాపులు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ ఆడిటోరియంలో ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ లాటరీ డ్రా నిర్వహించారు. 48 మద్యం దుకాణాలకు1,381 దరఖాస్తుల నుంచి ఎంపిక చేశారు.గౌడ వర్గానికి 9, ఎస్సీలకు 5 షాపులు రిజర్వ్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.


