బీఆర్‌ఎస్‌లో చేరిన డాక్టర్ సురంజన్
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంటకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సురంజన్ ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల *కాంగ్రెస్ పార్టీ*లో చేరిన డాక్టర్ సురంజన్, కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ పార్టీని వీడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా డాక్టర్ సురంజన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి జమ్మికుంట మున్సిపాలిటీలో ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని అన్నారు. గెలిచే అభ్యర్థులే కరువయ్యే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రెండేళ్లు గడిచినా అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఎదురులేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజేశ్వర్ రావు, రామస్వామి, కేడీసీసీ మాజీ వైస్ చైర్మన్ పింగిళి రమేష్, మాజీ ఎంఎప్పీ వెంకటేష్, మాజీ కౌన్సిలర్లు భాస్కర్, దిలీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


