శాతవాహన ఫార్మసీ విభాగాధిపతిగా డా. క్రాంతిరాజు నియామకం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో ఉన్న విశ్వవిద్యాలయ బి.ఫార్మసీ కళాశాల విభాగాధిపతిగా డా. క్రాంతిరాజును నియమిస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపకులపతి ఆదేశాల మేరకు ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. డా. క్రాంతిరాజు 2013లో శాతవాహన విశ్వవిద్యాలయంలో ఫార్మసీ విభాగంలో చేరి బోధనా బాధ్యతలతో పాటు పరిశోధన రంగంలోనూ విశేష సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు మూడు పేటెంట్లు నమోదు చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 16 పరిశోధనా పత్రాలను సమర్పించారు. అలాగే ఆల్ ఇండియా ఫార్మసీ టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఫార్మసీ కళాశాల బాలుర వసతి గృహ వార్డెన్‌గా కూడా విధులు నిర్వహిస్తున్న డా. క్రాంతిరాజు, తనను విభాగాధిపతిగా నియమించినందుకు ఉపకులపతి, రిజిస్ట్రార్‌తో పాటు విసి కార్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.


