ఆరేళ్ల అభివృద్ధి కనిపించడం లేదా?
సుమారు రూ.1000 కోట్లతో పనులు
ఇతర ప్రాజెక్టులకు మరో రూ.200 కోట్లు..
బీజేపీ నేత, మాజీ మేయర్ సునీల్‌రావు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో గత ఆరు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించకపోవడం ఆశ్చర్యకరమని బీజేపీ నేత, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగరంలో నిర్మించిన రహదారులు, వీధిదీపాలు, పార్కులు, వాకింగ్ ట్రాకులు, ఓపెన్ జిమ్‌లు, హైలాండ్ జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, నిఘా కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా వంటి సదుపాయాలు కూడా కాంగ్రెస్ నాయకులకు కనబడటంలేదని విమర్శించారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన పనులన్నింటినీ విస్మరిస్తూ రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ఆరు సంవత్సరాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి సుమారు రూ.1000 కోట్ల నిధులు తీసుకొచ్చామని, రైల్వే ఓవర్ బ్రిడ్జి సహా ఇతర ప్రాజెక్టులకు మరో రూ.200 కోట్లు సమీకరించినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా నగరాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ అభివృద్ధి పేరుతో ఓట్లు అడుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రజలు అభివృద్ధి చేసిన పార్టీకే మద్దతు ఇస్తారని సునీల్‌రావు స్పష్టం చేశారు.


