ప్రయాణ ప్రాంగణాన్ని పట్టించుకోరా..?!
అధ్వానంగా కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్
నూతన బస్టాండ్ హామీలు కాగితాలకే పరిమితం
అభివృద్ధికి నిధులు లేవంటున్న అధికారులు
వర్షాకాలంలో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా పేరున్న కొత్తగూడెంలో తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. ఒకవైపు సిరులు ఉన్న సింగరేణి ప్రాంతం అయినప్పటికీ, అదే ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ మాత్రం మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సరైన వసతులు లేక తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అధికారులను ప్రశ్నిస్తే… ఆదాయం తక్కువగా ఉండటంతో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని సమాధానం చెబుతున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేక ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమా అన్నది అర్థంకాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో బస్టాండ్‌లోని సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు పైకప్పు నుంచి కారే నీటితో ఇబ్బందులు పడుతున్నారు.

కలగానే మిగిలిన మౌలిక సదుపాయాలు
కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో బస్సుల కంటే ప్రైవేటు వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మహిళా ప్రయాణికులకు మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతూ వినియోగానికి అనర్హంగా మారాయి. పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు సుమారు 60 సర్వీసులు నడుస్తున్నప్పటికీ, నెలకు దాదాపు రూ.15 లక్షల ఆదాయం మాత్రమే వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ ఆదాయంతో అభివృద్ధి సాధ్యపడటం లేదని వారు వాదిస్తున్నారు.

నేతల హామీలు బుట్టదాకలే
నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఆవిర్భవించినప్పటికీ, జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ అభివృద్ధిపై నేతలు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేరలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి నిధులతో బస్టాండ్ ఆధునీకరణకు సుమారు రూ.10 కోట్ల మేర తీసుకువస్తానని ఎమ్మెల్యే పూనమనేని సాంబశివరావు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగినా, ఆ దిశగా పురోగతి లేదని తెలుస్తోంది. సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో బస్టాండ్ అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారిందని స్థానికులు అంటున్నారు. శిధిలావస్థకు చేరిన బస్టాండ్‌కు తాత్కాలిక మరమ్మత్తులు చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అభివృద్ధికి నిధులేవి..?
జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్ల సుందరీకరణకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా విడుదల కాలేదని అధికారులు స్వయంగా చెబుతున్నారు. సింగరేణి, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బస్టాండ్ ఆవరణలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా అభివృద్ధికి వినియోగించడంలో ఎందుకు వెనుకాడుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు వాహనాల అక్రమ పార్కింగ్‌తో ఆర్టీసీ బస్సులు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, చర్యలు తీసుకునే నాధుడే కనపడటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం బస్టాండ్‌కు నూతన రూపం ఎప్పుడు వస్తుందోనన్న ప్రశ్న ఇప్పటికీ అనుత్తరంగానే మిగిలింది.


