పట్టించుకోరా?
చౌరస్తాలోనే చేపల అడ్డాలు
చోద్యం చూస్తున్న పాలకులు
అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
చేపల మార్కెట్‌ను మలుపు నుంచి తొలగించాలని డిమాండ్
కాకతీయ, రాయపర్తి: మండల కేంద్రంలోని ప్రధాన కూడలి రాజీవ్ చౌరస్తా వద్ద వెలిసిన చేపల మార్కెట్ స్థానికులకు, వాహనదారులకు నరకాన్ని చూపిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో ఇష్టారాజ్యంగా చేపల విక్రయాలు జరపడం వల్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. చేపలు కొనడానికి వచ్చే వారు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను రోడ్డుకు అడ్డంగా, మలుపు మధ్యలోనే నిలిపివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అటువైపు నుండి వచ్చే వాహనాలకు రోడ్డు అసలు కనిపించకుండా పోతోంది. వరంగల్ – ఖమ్మం రహదారి జనగామ- హైదరాబాద్ వైపు వెళ్లే మార్గాలను కలిపే అత్యంత కీలకమైన కూడలి ఈ మార్గం గుండా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లే భక్తులు ట్రాఫిక్ ఇబ్బందితో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పొంచి ఉన్న ప్రమాదాలు
వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిని కలిపే ఈ చౌరస్తా మలుపులోనే చేపల దుకాణాలు ఉండటంతో వాహనదారులు మలుపు తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలుదారులు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపి రోడ్డును ఆక్రమించడం వల్ల నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతుంది. మలుపు తిరిగే క్రమంలో అకస్మాత్తుగా పార్క్ చేసిన వాహనాలు ఎదురురావడంతో నిత్యం ఘర్షణలు,ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఈ చేపల మార్కెట్ వద్ద పెర్కవేడు గ్రామ యువకులు, రాయపర్తి గ్రామ యువకుల మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
విద్యార్థుల అవస్థలు
మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఈ కూడలిని దాటే వెళ్ళాలి. పాఠశాల ముగిసాక సాయంత్రం ఇంటికి చేరుకునే క్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు పాఠశాల బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, మార్కెట్ రద్దీలో బస్సును పక్కకు ఆపడానికి చోటు లేక, రోడ్డు మధ్యలోనే బస్సు ఆపాల్సి వస్తుందని డ్రైవర్లు పేర్కొంటున్నారు. దీనివల్ల పిల్లలు దిగేటప్పుడు వెనుక నుంచి వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయాందోళనకు గురవున్నారు.
తీవ్ర ఇబ్బందులు: ఐత సంపత్
మండల కేంద్రంలోని వరంగల్ – ఖమ్మం రహదారిని ఆనుకొని చేపల మార్కెట్ మలుపుపై ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ప్రమాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి. చేపల మార్కెట్‌ను తక్షణమే మలుపు నుండి తరలించాలి. ప్రజా ప్రతినిధులు, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి రాయపర్తి రాజీవ్ చౌరస్తాలో నెలకొన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. సురక్షిత ప్రాంతంలో చేపల విక్రయలు జరిగేలా చర్యలు చేపట్టాలి.


