- డీఎం హెచ్ఓ గోపాల్ రావు
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు స్వయంగా పస్రా గ్రామంలోని కేర్, వినాయక డయాగ్నోస్టిక్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ల్యాబుల రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు, రిపోర్టులను సవివరంగా పరిశీలించారు. ల్యాబ్ యజమాన్యంతో మాట్లాడుతూ అవసరం లేని పరీక్షలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయరాదని, ఆర్థికంగా నష్టపరచకూడదని, పరీక్షల ధరల పట్టికను ల్యాబ్ ముందు స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా ల్యాబ్‌లు నడపాలని, ఉల్లంఘనలకు పాల్పడితే సీజ్ చేస్తామని, చర్యలు తప్పవని హెచ్చరించారు. తరువాత సిరి క్లినిక్‌ను కూడా పరిశీలించిన డాక్టర్ గోపాల్ రావు, రిజిస్ట్రేషన్ పత్రాలను తనిఖీ చేశారు. అనంతరం పస్రా గ్రామంలోని ఆర్‌ఎంపీలు, పీఎంపీలతో సమావేశమై అర్హతకు మించి వైద్య సేవలు చేయకూడదని, యాంటీబయోటిక్స్, సెలైన్ వంటి చికిత్సలు నిర్దిష్ట అర్హత కలిగిన వైద్యులే చేయాలని హెచ్చరించారు. ఈ తనిఖీలో జిల్లా క్షయ, కీటకజన్య వ్యాధుల నియంత్రణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రకాంత్ పాల్గొన్నారు.


