ప్రజా తీర్పుతో ఆటలు ఆడొద్దు
ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోనివ్వద్దు
కాంగ్రెస్ ఉద్దేశ పూర్వకంగానే క్యాతనపల్లి మున్సిపల్లో వివాదం
కౌన్సిలర్లపై ఒత్తిళ్లు కొనసాగాయి.. ప్రలోబాలకు గురి చేశారు
మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపాటు
పాపపు పాలనగా మారింది : బాల్క సుమన్
కాకతీయ, కరీంనగర్ : ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం దెబ్బతినకుండా ప్రభుత్వం వ్యవహరించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని శ్వేతా హోటల్లో మాజీ ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, ఆ తీర్పును వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కౌన్సిలర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం ద్వారా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్నికల కమిషన్, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, సీపీఐలకు స్పష్టమైన మెజారిటీ ఉందని తెలిపారు.
పాపపు పాలనగా మారింది : బాల్క సుమన్
మాజీ ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ, ఇది ప్రజాపాలన కాదని, పాపపు పాలనగా మారిందని మండిపడ్డారు. క్యాతనపల్లి చైర్మన్ పీఠం కోసం ప్రభుత్వం, జిల్లా మంత్రి కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గెలిచిన ప్రజాప్రతినిధులను బెదిరించడం, పోలీసు బలంతో నిర్బంధించడం వంటి చర్యలు ప్రజలకు తెలిసినవేనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజా తీర్పు ప్రస్తుతం కాంగ్రెస్‌కు అనుకూలంగా లేదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు తప్పవని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధిక విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం భారీ అప్పులు చేసి ప్రజా సంక్షేమానికి వినియోగించడం లేదని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధి నిలిచిపోయిందని, మానేరు రివర్‌ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి వంటి ప్రాజెక్టులతో నగరాన్ని అభివృద్ధి చేశామని వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.


