వైన్ షాపు పెట్టొద్దు..!
బొక్కలగడ్డ కాల్వొడ్డు వద్ద మహిళలల నిరసన
నిరసనకు బీజేపీ నేత దేవకి వాసుదేవరావు మద్దతు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : బొక్కలగడ్డ కాల్వొడ్డు వద్ద ఉన్న కళా వైన్స్ కారణంగా స్థానిక మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భద్రత సమస్యలపై మంగళవారం మహిళలు వైన్స్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి హాజరై మహిళలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎక్సైజ్ శాఖ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వైన్స్ వల్ల మహిళలు, విద్యార్థినులు, గృహిణులు ఇళ్ల నుంచి బయటకి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని, ఇది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అని పేర్కొన్నారు.
ప్రభుత్వం మహిళల భద్రతను కాపాడాల్సిన సమయంలో ఈ అసౌకర్యం కొనసాగడం బాధాకరం అని ఆయన అన్నారు. మహిళల సమస్యపై ఒక్కమంత్రి కూడా స్పందన ఇవ్వకపోవడం ప్రజలపై అవమానకర చర్య అని అభిప్రాయపడ్డారు. పదవులు, పార్టీలు మార్చడంలో వేగంగా ఉండే మంత్రులు మహిళల భద్రత విషయంలో మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారని ఆయన విమర్శించారు.మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం… మహిళలు రోడ్డుకి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే అది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.గాంధీ సిద్ధాంతాలను నోటి మాటగా మార్చేసిన కాంగ్రెస్ పాలనలో, “ఆడవారు అర్ధరాత్రి కూడా భయపడకుండా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం” అని చెప్పుకునే కాంగ్రెస్ ఈరోజు ఖమ్మంలో పగలప్పుడే మహిళలు బయటకు రావడానికి భయపడే పరిస్థితి తెచ్చిందని ఆయన విమర్శించారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ మహిళల భద్రతకు సంబంధించిన చిన్న సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడిందని, ముగ్గురు మంత్రులు ఉన్నట్టా? లేక లేనట్టా? అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకపోయినా, రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మంకు రెండు కొత్త వైన్స్ లు మాత్రం ఇచ్చిందని ఆయన విమర్శించారు.
మహిళల భద్రత, గౌరవం విషయంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కళా వైన్స్‌ను తరలించాలని డిమాండ్ చేశారు. మహిళల సమస్యను తక్కువగా తీసుకుంటే ప్రజలతో కలిసి బలమైన ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలుకొంపర్ల సురేఖ, దొడ్డ అరుణ, మంద సరస్వతి,కొణతం లక్ష్మీనారాయణ, శాసనాల సాయిరాం, గడీల నరేష్, ఆర్ వి ఎస్ యాదవ్, వాకదాని రామకృష్ణ, పాలెపు జంగిలి రమణ, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు..


