- బకాయిలు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు
- ఆరోగ్యశ్రీ బకాయిలపైనా ఉద్యమానికి సిద్ధం
- మంత్రులు కమీషన్లు వసూలు చేసి హైకమాండ్‌కు కప్పం కడుతున్నారు
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : విద్యార్థుల, విద్యాసంస్థల బకాయిలు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ నల్లకుంటలోని శంకర్‌మఠ్ ను దర్శించుకున్న బండి సంజయ్, శ్రుంగేరి పీఠాధిపతి శ్రీ విదుశేఖర భారతి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. విద్యార్థుల, యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలని సర్కార్ కు సూచించారు. కమీషన్లు రావనే సాకుతో బకాయిలు ఆపడం సిగ్గుచేటని, అసెంబ్లీలో ఇచ్చిన హామీని కూడా కాలరాస్తున్నారని అన్నారు.
బీహార్ ఎన్నికలకు డబ్బులు ఇక్కడి నుంచే పంపుతున్నారని, అయితే విద్యార్థుల బకాయిల చెల్లింపుపై మాత్రం సర్కార్ మౌనం పాటిస్తోందని విమర్శించారు. ఈసారి తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించకపోతే విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి మంత్రులను అడ్డుకుంటామని సంజయ్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో కూడా రోడ్డెక్కడం తథ్యమని ఆయన అన్నారు. మంత్రులు ప్రతి పనికీ కమీషన్లు వసూలు చేసి ఆ సొమ్మును కాంగ్రెస్ హైకమాండ్‌కు కప్పం కడుతున్నారని ఆరోపించారు.


