ఆలస్యం చేయొద్దు
పనుల్లో వేగంపెంచాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలి
కలెక్టర్ గరిమ అగ్రవాల్
కాకతీయ, సిరిసిల్ల టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి గృహప్రవేశానికి సిద్ధం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ లబ్ధిదారులకు సూచించారు. గురువారం పట్టణంలోని నాలుగో వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలిగేటి రూపిక, కొండబత్తిని పండరి, కొయ్యాడ మానస తమ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. గృహప్రవేశానికి అనువుగా ఇళ్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించిన కలెక్టర్, హౌసింగ్, మున్సిపల్ అధికారులు నిర్మాణాల ఫోటోలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో హౌసింగ్ పీడీ సాజిద్, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ
సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థుల హాజరు, పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పించిన వసతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.



