నిబంధనల గీత దాటొద్దు!
భద్రత, ప్రోటోకాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మినిట్ టు మినిట్ షెడ్యూల్‌ను సన్నద్ధం చేసుకోవాలి
అధికారులకు జిల్లా ఇంచార్జి కలెక్టర్ పి.శ్రీజ ఆదేశాలు
సీఎం పర్యటన ఏర్పాట్లపై యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా నిబంధనలు, ప్రోటోకాల్ ప్రకారమే జరగాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు. జనవరి 18న ఖమ్మం జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారం, మినిట్ టు మినిట్ షెడ్యూల్ వెలువడకముందే అవసరమైన సన్నద్ధత ఏర్పాట్లన్నింటిని పూర్తి చేయాలని సూచించారు. పర్యటనలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల షెడ్యూల్ ఇదే
జనవరి 18న ఉదయం ముఖ్యమంత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి హెలిప్యాడ్‌లో ల్యాండ్ అయి, జేఎన్‌టీయూ కళాశాల భవన నిర్మాణం, మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే నూతన మార్కెట్ యార్డు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, కూసుమంచి 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ పైలాన్‌లను ఆవిష్కరించి అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం పూర్తి స్థాయి భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీఎం కాన్వాయ్‌లో వినియోగించే వాహనాలను ముందస్తుగానే పూర్తిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అవసరమైన అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. నర్సింగ్ కళాశాల, సర్దార్ పటేల్ స్టేడియం వద్ద హెలిప్యాడ్‌లను డీజీసీఏ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసి అక్కడ ఫైర్ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. జిల్లాలోని సీనియర్ వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని 108 అంబులెన్స్‌తో పాటు సీఎం కాన్వాయ్‌లో ప్రోటోకాల్ ప్రకారం సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అతిథి గృహాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, నాణ్యమైన స్నాక్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి సర్టిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. విధులు నిర్వహించే అధికారులకు ప్రత్యేక ఐడీ కార్డులు అందించాలని, మీడియాతో సమన్వయం చేసుకుంటూ విస్తృత కవరేజ్ వచ్చేలా చూడాలని సూచించారు. అలాగే జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి పనులపై శాఖల వారీగా బ్రీఫ్ నోట్స్ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.


