డంపింగ్ యార్డు తీసుకురావద్దు
మా ప్రాణాలను బలి చేయొద్దు
సిరిసపల్లిలో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన
ఐక్య పోరాట సమితి పిలుపుతో గ్రామస్తుల ఆందోళన
కాకతీయ, హుజురాబాద్ : డంపింగ్ యార్డు నిర్మాణం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ పరిధిలోని సిరిసపల్లి గ్రామంలో వేస్ట్ బేస్డ్ డంపింగ్ యార్డు నిర్మాణానికి వ్యతిరేకంగా ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. సర్పంచ్ పోల్సాని రామారావు నేతృత్వంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, డంపింగ్ యార్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని అన్నారు. అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు వల్ల హుజురాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల 20 గ్రామాలు కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు రద్దు వరకు పోరాటం
ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. డంపింగ్ యార్డు రద్దు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఐక్య పోరాట సమితి కార్యక్రమాలకు బీసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరాట సమితి నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండాల్ రెడ్డి, రాజపల్లి సర్పంచ్ కట్కూరి మల్లారెడ్డి, గుడిపాటి జయపాల్ రెడ్డి, హనుమంతరావు, మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డ్ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, తడిక మల్ల శేఖర్, ఆడెపు సురేందర్, కళ్లెపు రాఘవరావు, ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ, జనగాం రాజు, బీసీ జేఏసీ నాయకులు ఇప్పకాయల సాగర్, చిలుకమారి శ్రీనివాస్, ఉప్పు శ్రీనివాస్, బెల్లి రాజయ్య, ఆకుల సదానందం, మార్త రవి, మాడుగుల ఓదెలు, మంచికట్ల విజయ్, జూపాక నర్సింహచారి, గోస్కుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


