కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు
ఓటుతో గట్టి బుద్ధి చెప్పాలి
బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, పరకాల : కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. పరకాల మున్సిపాలిటీ 14వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి పడిదెల దీప్తి రాకేష్ గెలుపును కాంక్షిస్తూ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మరోసారి మోసపోతే పట్టణ అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ పాలనలోనే పరకాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. మున్సిపాలిటీగా మార్చడం ద్వారా నిధులు, మౌలిక వసతులు మెరుగుపడ్డాయని అన్నారు. ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


