శిశుమందిర్ అభివృద్ధికి లక్ష విరాళం
అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, విలువలే నా బంగారు బాటలయ్యాయి
: స్వర్గం మల్లేశం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి స్వర్గం మల్లేశం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. గతంలో శిశుమందిర్‌లో ఉపాధ్యాయునిగా సేవలందించిన ఆయన, తన 75వ వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా సహాయాన్ని ప్రకటించడం విశేషం. కరీంనగర్ పద్మశాలి హాస్టల్ కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహించిన జన్మదిన వేడుకల సందర్భంగా, శిశుమందిర్ అభివృద్ధి కమిటీ కార్యదర్శి కోల అన్నారెడ్డికి రూ.లక్ష చెక్కును మల్లేశం అందజేశారు. అదేవిధంగా, పాఠశాలలో ఒక తరగతి గది నిర్మాణానికి అవసరమైన వ్యయంగా రూ.7 లక్షల వరకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. 1973 సెప్టెంబర్‌లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరిన మల్లేశం, అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, విలువలే తన జీవితానికి బంగారు బాటగా మారాయని చెప్పారు. శిశుమందిర్‌లో పనిచేసే సమయంలోనే సహచర ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 1975 నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి, క్రమంగా స్థిరపడినట్లు వివరించారు. ఆ ప్రయాణం స్వర్ణోత్సవంగా మారి, తనను సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకువచ్చిందన్నారు. తాను చదువుకున్న, పనిచేసిన శిశుమందిర్ పట్ల కృతజ్ఞతాభావంతోనే ఈ విరాళం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిశుమందిర్ పూర్వ ఉపాధ్యాయులు ముకుందం, హనుమంతరావు, చిరంజీవ చారి, పరశురామ్‌జీ, సబ్బని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాలను పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు.


