క్రైస్తవ ఆరాధాకులకు వస్త్రాల బహూకరణ
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ రవిచంద్ర
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మండిబజార్ నిజాంపురలోని సెంటెనరి ట్రినిటీ బాప్టిస్ట్ చర్చిలో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో క్రిస్మస్, రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పాస్టర్లకు నూతన వస్త్రాలు బహూకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సుమారు 300 మంది పాస్టర్స్‌కు రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన తల్లిదండ్రులు కీ.శే. వద్దిరాజు నారాయణ, వెంకటనరసమ్మ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయన వ్యక్తిగత సహాయకులు వీణవెంక కిరణ్ కుమార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రవిచంద్ర గారు బీద కుటుంబాలకు అండగా నిలిచి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన దాతృత్వ హృదయానికి కృతజ్ఞతలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ క్రైస్తవ ఐక్య వేదిక అధ్యక్షుడు రెవ. గంధం అరుణ్ జేమ్స్, చైర్మన్ సరిగోమ్ముల దీన్ దయాల్, వైస్ చైర్మన్ ఎంఎస్ రాజు పాస్టర్, ఎంఎస్ శామ్యూల్, స్థానిక సంఘ కాపరి డాక్టర్ బి. వినయ్ కుమార్, పాస్టర్లు అబ్రహం, వస్కూల వివేక్, జేమ్స్ ఎవాంజలిస్ట్, రాజు, ప్రమోద్ కుమార్, నిజాంపూర్ చర్చ్ ప్రెసిడెంట్ పీకే విజయ్ కుమార్, జేజే విల్సన్, పెన్ను శ్రీనివాస్, రవిచంద్ర యువసేన సభ్యులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


