ప్రతి నెలా బీఆర్‌ఎస్‌కు రూ.5 వేల విరాళం
మేం పార్టీ మారలేదు: ఎమ్మెల్యేల స్పష్టీకరణ
ఫిరాయింపు ఆరోపణలకు స్పీకర్ క్లీన్‌చిట్
సుప్రీంకోర్టు అఫిడవిట్‌లో కీలక అంశాలు
కాకతీయ, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ను వీడలేదంటూ పలువురు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇచ్చారు. ఈ మేరకు జారీ చేసిన ఆర్డర్ కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి నెలా తమ జీతాల నుంచి బీఆర్‌ఎస్ శాసనసభాపక్షానికి (బీఆర్ ఎస్ ఎల్‌పీ) రూ.5 వేల చొప్పున విరాళం చెల్లిస్తున్నామని ఎమ్మెల్యేలు మహిపాల్, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్ స్పీకర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. పార్టీకి ఆర్థికంగా విరాళాలు ఇస్తున్నప్పుడు, పార్టీ మారినట్లు ఎలా భావించగలమని వారు ప్రశ్నించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్, పార్టీ ఫిరాయింపు జరిగిందని నిర్ధారించడానికి తగిన ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. అందుకే సంబంధిత ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ కాపీలోనూ స్పష్టంగా పొందుపరిచినట్లు సమాచారం. పార్టీకి విధిగా విరాళాలు చెల్లించడం, శాసనసభాపక్షంతో అనుబంధం కొనసాగించడం వంటి అంశాలు పార్టీ ఫిరాయింపు కాదనే వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, ఫిరాయింపుల కేసులపై భవిష్యత్తులో న్యాయపరమైన, రాజకీయ ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.


