తెగిపోయిన చెవిని అతికించిన వైద్యులు
కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం
డాక్టర్ శాంసన్ ఆధ్వర్యంలో విజయవంతమైన శస్త్రచికిత్స
కాకతీయ, కొత్తగూడెం : పూర్తిగా వేరైన చెవిని విజయవంతంగా పునఃస్థాపన చేసినట్లు ఈఎన్‍టి వైద్య బృందం వెల్లడించింది. క్లిష్టమైన పరిస్థితిని సవాల్‌గా తీసుకుని శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చుంచుపల్లి మండలం రామవరం గ్రామానికి చెందిన నిర్మల 40 తీవ్ర గాయంతో చేరారు. ఆమెకు గ్రేడ్ 4 స్థాయి గాయం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చెవి భాగం పూర్తిగా వేరైపోయిన పరిస్థితి ఉండటంతో అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స చేపట్టారు.
డాక్టర్ శాంసన్ ఆధ్వర్యంలో ఈఎన్‍టి బృందం శస్త్రచికిత్స నిర్వహించి చెవి భాగాన్ని పునఃస్థాపన చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో మెరుగుదల దిశగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ శస్త్రచికిత్సలో అనస్థీషియా విభాగం వైద్యులు, ఆపరేషన్ థియేటర్ నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్‌లు సమిష్టిగా కృషి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.


