- కేంద్రం నా బెంచ్‌ను తప్పించాలని చూస్తోంది
- సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు
- మరో 20 రోజుల్లోనే ముగియనున్న పదవీకాలం
- రిటైర్మెంట్ వేళ సీజేఐకి కేంద్రం షాక్ !
కాకతీయ, నేషనల్ డెస్క్ : సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా మరో 20 రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఓ అనూహ్య పరిణామం ఎదురైంది. సుప్రీంకోర్టులో దాఖలైన ఓ కీలక పిటిషన్ విషయంలో కేంద్రం చేసిన విజ్ఞప్తి ఆయనకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం సుప్రీంకోర్టుతో ఆటలాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు మరికొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ తాజాగా కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్ధించింది. అయితే ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా ముగిశాయి. తీర్పు కూడా ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ట్రైబ్యునల్ రిఫామ్స్ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ కొనసాగుతోన్న మధ్యలో కేంద్రం అభ్యర్థించడం గమనార్హం. నవంబరు 3న సోమవారం పిటిషనర్ల వాదనలు పూర్తయ్యాక, అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో పాల్గొనడానికి వీలుగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోరడంతో జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలో ఐదుగురు జడ్జిల బెంచ్‌కు బదిలీ చేయాలని ఏజీ అభ్యర్థించారు. దీంతో షాకైన న్యాయమూర్తులు.. ‘ప్రస్తుత బెంచ్‌ను తప్పించుకోవాలనే రీతిలో కేంద్రం ఉన్నట్టుంది’ అని వ్యాఖ్యానించారు.
ఇటువంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని ఊహించలేదు
‘‘కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వైఖరి అవలంభిస్తుందని, న్యాయస్థానంతో ఇటువంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని మేము ఊహించలేదు..’’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరో 20 రోజుల్లోనే జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే. ‘‘మేము పిటిషనర్ల తరఫు లాయర్ల వాదనలు పూర్తిస్థాయిలో విన్నాం.. వాదనలు పూర్తయిన తరువాత ఏ ఒక్కసారి కూడా అటార్నీ జనరల్ ‘కేంద్ర ప్రభుత్వం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ అంశం రిఫర్ చేయమందని కోరలేదు’’ అని పేర్కొన్నారు. ‘కానీ, మేము ఈ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం.. అలాగే, ప్రస్తుత ధర్మాసనాన్ని కేంద్రం తప్పించుకునే ఉద్దేశంలో ఉంది ఎందుకంటే మరికొద్ది రోజుల్లో సీజేఐ పదవీకాలం ముగియనుంది’ అని జస్టిస్ గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.


