బలవంతంగా చలాన్లు వసూలు చేయొద్దు
కాకతీయ, హైదరాబాద్ : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పేరిట వాహనదారులను బలవంతంగా డబ్బులు కట్టించరాదని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చలాన్లు చెల్లించాలంటూ వాహనదారుల బైక్ కీలు లాక్కోవడం, రోడ్డుపైనే ఒత్తిడి తెచ్చి వసూలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. చలాన్లు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని, వాహనదారులు చెల్లించేందుకు నిరాకరిస్తే చట్టప్రకారం నోటీసులు జారీ చేయాలని హైకోర్టు సూచించింది. బలవంతపు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల హక్కులు హరించే పరిస్థితి తలెత్తుతుందని పేర్కొంది. ట్రాఫిక్ నిబంధనల అమలు అవసరమే అయినప్పటికీ, చట్ట పరిధిలోనే అధికారులు వ్యవహరించాలని, అధికారం దుర్వినియోగానికి తావు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలతో చలాన్ల వసూలులో అనుసరించాల్సిన విధానంపై స్పష్టత వచ్చిందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


