అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు
ట్రాన్స్‌కోలో సీఈ తీరుపై విమర్శలు
వరంగల్ జోన్‌లో చీఫ్ ఇంజనీర్‌పై కార్మికుల ఆగ్రహం
నేరుగా సమస్యలు చెప్పొద్దంటూ ఆదేశాలు జారీపై ఆవేదన
మానసిక ఒత్తిడికి గురవుతున్నామంటున్న ఉద్యోగులు
తెలంగాణలోనూ “పెత్తనం” కొనసాగుతోందని విమర్శలు
పరిస్థితి మారకపోతే ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరిక
కాకతీయ, వరంగల్: ట్రాన్స్‌కో వరంగల్ జోన్‌లో కొత్తగా జారీ చేసిన క్రమశిక్షణ మార్గదర్శకాలు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి. చీఫ్ ఇంజనీర్ తీరుపై విద్యుత్ కార్మికులు, ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకునే అవకాశమే లేకుండా ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వరంగల్ జోన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల ప్రకారం… చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి నేరుగా రావొద్దని, కేవలం కంట్రోలింగ్ అధికారుల ద్వారా మాత్రమే తమ సమస్యలను తెలియజేయాలని మెమో రూపంలో ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల సమస్యలు పై స్థాయికి చేరే మార్గం దాదాపు మూసుకుపోయిందని కార్మికులు పేర్కొంటున్నారు. ఇకపై అనుమతి లేకుండా చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం మరింత ఆందోళనకు గురిచేస్తోందని చెబుతున్నారు. తమ మాట వినకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు.
సమస్యలు చెప్పుకోవడమే నేరమా?
ఫీల్డ్‌లో పని చేసే ఉద్యోగులకు రోజువారీగా ఎదురయ్యే సమస్యలు చాలా ఉంటాయని, వాటిని ఉన్నతాధికారులకు నేరుగా చెప్పడం సహజమని కార్మికులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేయడం వల్ల తమ బాధలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కంట్రోలింగ్ అధికారుల ద్వారా మాత్రమే విషయాలు చెప్పాలని నిబంధన పెట్టడం వల్ల అనేక సమస్యలు అక్కడే ఆగిపోతున్నాయని, పై స్థాయికి చేరడం లేదని వారు అంటున్నారు.
ట్రాన్స్‌కో అధికారులు మాత్రం ఈ నిర్ణయం క్రమశిక్షణ కోసం తీసుకున్నదని చెబుతున్నా… ఉద్యోగులు మాత్రం ఇది క్రమశిక్షణ పేరుతో ఒత్తిడి పెంచే చర్యగా అభివర్ణిస్తున్నారు. చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి తరచుగా వెళ్లడం వల్ల పనితీరుకు అంతరాయం కలుగుతోందని అధికారులు చెబుతుండగా, ఫీల్డ్ సిబ్బంది మాత్రం తమ సమస్యలు పరిష్కారం కావడానికే ఆఫీస్‌కు వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. అనుమతి లేకుండా వెళ్లినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పడం వల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఇది పని సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతోందని వారు చెబుతున్నారు.
“పెత్తనం” కొనసాగుతోందని ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగడం బాధాకరమని విద్యుత్ కార్మికులు విమర్శిస్తున్నారు. స్థానిక ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా “బయటి రాష్ట్ర అధికారుల పెత్తనం” కొనసాగుతోందని కార్మిక సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవడం బాధ కలిగిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలాగే కొనసాగితే పెద్ద స్థాయిలో ఆందోళనకు దిగాల్సి వస్తుందని విద్యుత్ కార్మికులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేస్తున్నారు. ట్రాన్స్‌కోలో ఫీల్డ్ సిబ్బంది స్వేచ్ఛగా తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి కల్పించాలని, కొత్త ఆంక్షలను పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. “అనుమతి లేక అడుగు లేదు” అన్న కొత్త విధానం… క్రమశిక్షణ కంటే వివాదాలకు దారి తీసినట్టుగా కనిపిస్తోంది. అధికారులు తీసుకున్న నిర్ణయం ఒకవైపు డిసిప్లిన్ కోసం అయితే, మరోవైపు ఉద్యోగుల్లో అసంతృప్తి పెంచుతోంది. ఇక ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో… యాజమాన్యం వెనక్కి తగ్గుతుందా? లేక కార్మికులు ఆందోళనకు దిగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.


