సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం చేయొద్దు
అధికారులకు హన్మకొండ అదనపు కలెక్టర్ రవి ఆదేశాలు
శాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు
భూభారతి–సాదా బైనామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
కాకతీయ, పరకాల : హనుమకొండ జిల్లా శాయంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ ఎన్. రవి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ భూభారతి, సాదా బైనామా, జాతీయ రహదారులు, మీ సేవా సర్టిఫికెట్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ తదితర పథకాల రికార్డులను పరిశీలించారు. మండల స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందన్న అంశంపై వివరాలు సేకరించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మీ సేవా సర్టిఫికెట్లు సహా అన్ని ధృవపత్రాలను త్వరితగతిన మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా భూభారతి, సాదా బైనామా వంటి రెవెన్యూ అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. రెవెన్యూ సంబంధిత దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా సకాలంలో పరిష్కరించాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు. అవసరమైన చోట సిబ్బంది సమన్వయంతో పనిచేసి సేవల నాణ్యతను మెరుగుపర్చాలని చెప్పారు. భూ సమస్యల పరిష్కారంలో స్పష్టమైన మార్గదర్శకాలు పాటిస్తూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


