కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వైద్య సేవల తీరును సమగ్రంగా పరిశీలించారు. ముందుగా అవుట్ పేషెంట్ విభాగాన్ని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సవివరంగా ఆరా తీసి, తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే సిబ్బందితో సమావేశమై రికార్డుల నిర్వహణ, ఔషధాల సరఫరా, శుభ్రత, వ్యాధి నివారణ చర్యల అమలు వంటి అంశాలపై సమీక్ష జరిపారు. ప్రజలకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, అనిల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


