కొండగట్టు లో అపశృతి
చలువ పందిరి కూలి భక్తులకు గాయాలు
కాకతీయ, కొండగట్టు : కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిరి బుధవారం అకస్మాత్తుగా కూలిపోవడంతో సుమారు 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చిన వేళ ఈ ఘటన జరగడం కలకలం రేపింది.సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, ఆలయ సిబ్బంది గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పందిరి నిర్మాణంలో నాసిరకం సామగ్రి ఉపయోగించడమే ప్రమాదానికి కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల భద్రతపై బాధ్యత వహించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.



