కేజీబీవీలో జిల్లా ప్యానెల్ తనిఖీలు
నల్లబెల్లిలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ సందర్శన
బోధన విధానం, అకడమిక్ రికార్డుల పరిశీలన
పదో, ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణపై సూచన
కాకతీయ, నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో జిల్లా ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ బృందం సోమవారం తనిఖీలు నిర్వహించింది. నోడల్ అధికారి గాయపు లింగారెడ్డి నేతృత్వంలోని టీం–2 బృందం పాఠశాలను సందర్శించి తరగతి గదుల్లో ఉపాధ్యాయినుల బోధన తీరును పరిశీలించింది.విద్యార్థుల హాజరు, పాఠ్య ప్రణాళిక అమలు, బోధన పద్ధతులపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ కార్యక్రమం, నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం అమలు తీరును కూడా పరిశీలించారు. రోజువారీ రిజిస్టర్లు, అకడమిక్ రికార్డులు, విద్యార్థుల ప్రగతి నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా సమన్వయంతో పని చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.


