దుగ్గొండి అధికారులకు జిల్లా స్థాయి గుర్తింపు
సీఐ, తహసీల్దార్, ఎంపీడీఓకు ఉత్తమ అవార్డులు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసాపత్రాల ప్రదానం
కాకతీయ / దుగ్గొండి : 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ వేడుకల్లో దుగ్గొండి మండలం నుంచి ముగ్గురు కీలక అధికారులు జిల్లా స్థాయి గుర్తింపును పొందడం విశేషం. దుగ్గొండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాయి రమణ, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ *అరుంధతి*లకు విధుల్లో చూపిన నిబద్ధత, ప్రజాసేవకు గుర్తింపుగా ప్రశంసాపత్రాలు అందాయి. వీరితో పాటు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎన్. రవికుమార్, సాంఘిక సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న టీజీటీ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు వి. వెంకటరమణ, పొనకల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కోల కవితలకు కూడా ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసాపత్రాలు అందించారు. ఈ అవార్డులు దుగ్గొండి మండల అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలిచాయి.


