కాకతీయ, బయ్యారం: మండలంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు అనంతరం జడ్పీఎస్ఎస్ బాలుర ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం తుఫాన్ కారణంగా ముందస్తు చర్యలలో భాగంగా నామలపాడులోని లో లెవెల్ కల్వర్టును బయ్యారం పెద్ద చెరువు అలుగులను (మత్తడి) పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అవసరమైతే తప్ప ప్రజలు బయటకి.రాకూడదన్నారు.వాతావరణ సూచన ల మేరకు జిల్లాలో గురువారం , శుక్రవారం,భారీ వర్షం సూచన ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, క్షేత్రస్థాయిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, సూచించారు, ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని సూచించారు.పట్టణాలు, గ్రామాలలో వర్ష సూచనలపై అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు విస్తృత ప్రచారం (టామ్ టామ్) సోషల్ మీడియా, స్థానిక వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం అందించి అప్రమత్తత చేయాలన్నారు.
ఎలాంటి పశు సంపద, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, లేకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక సమర్పిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమున్న చోట విపత్తుల నివారణ సిబ్బంది, రెవెన్యూ ,పోలీస్, గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బంది యొక్క సేవలు వినియోగించుకోవాలని అధికారులను సూచించి నిత్యం అలర్టుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ నాగరాజు, ఎంపిడిఓ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


