కాకతీయ, మహబూబాబాద్ రూరల్: శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలోని గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, మరుగుదొడ్లు, తరగతి గదులు, స్టోర్ రూమ్, పరిసరాలను పరిశీలించారు.
స్టడీ అవర్ లో ఉన్న పిల్లలతో స్వయంగా మాట్లాడి వారి విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు, ప్రభుత్వం అందిస్తున్న నూతన డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతుల ద్వారా పిల్లల మేధస్సును వెలికితీయడానికి ఉపాధ్యాయులు పక్కాగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. టైం టేబుల్ ప్రకారం తరగతులు, పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
వానాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మానసిక ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలన్నారు. విద్యతో పాటు, క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని, స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని, విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు, ప్రత్యేక అధికారులు తమ పర్యటన షెడ్యూల్లో వసతి గృహాలలో తనిఖీలు చేయాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, నిత్యం వసతి గృహంలో ఏఎన్ఎం అందుబాటులో ఉండాలని సూచించారు.


