ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ
కౌన్సిలర్ గుగ్లోత్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహణ
మున్సిపాలిటీ 8వ వార్డు పల్లెపహాడ్‌లో కార్యక్రమం
కాకతీయ, గజ్వేల్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం కుటుంబాలు కూడా ఆనందంగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాలను పంపిణీ చేస్తున్నట్లు 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ గుగ్లోత్ రమేష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు పల్లెపహాడ్‌లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆదేశాలతో కౌన్సిలర్ గుగ్లోత్ రమేష్ వార్డులోని ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దానం ద్వారా సామాజిక సమానత్వాన్ని, పరస్పర సహాయ సహకారాల భావనను పెంపొందించే పండుగగా నిలుస్తుందని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు కూడా రంజాన్‌ను ఆనందంగా జరుపుకునేలా ప్రభుత్వం తోఫాలు అందజేస్తోందని తెలిపారు. విద్య, ఉపాధి, ఆర్థిక సహాయం వంటి రంగాల్లో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ పలు కార్యక్రమాలు చేపడుతోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొక్కొండ శ్రీనివాస్ చారి, సిరిమిల్ల అశోక్, పోతుల కిషన్, కిష్టయ్య, స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.


