చిన్నారులకు పాదరక్షల పంపిణీ
కోయగట్టు అంగన్వాడిలో సేవా కార్యక్రమం
నిరుపేద విద్యార్థులకు చెప్పులు అందజేత
కాకతీయ కొత్తగూడెం: కోయగట్టు గ్రామంలోని అంగన్వాడి చిన్నారులకు పాదరక్షలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మణ్, స్నేహ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామపంచాయతీ పరిధిలోని కోయగట్టు గ్రామ అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్న నిరుపేద చిన్నారులకు చెప్పులు అందజేశారు. మొత్తం నలభై మంది విద్యార్థులకు సుమారు పది వేల రూపాయల విలువైన పాదరక్షలు పంపిణీ చేశారు. చిన్నారులకు అవసరమైన సహాయం అందించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు నీలేష్ ఇండియన్, వాలంటీర్ రూప్లా నాయక్, గ్రామ సర్పంచ్, అంగన్వాడి టీచర్ సుజాతతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు. చిన్నారులకు ఇలాంటి సహాయ కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని గ్రామ ప్రజలు కోరారు.


