మున్సిపల్ కార్మికులకు వస్త్రాల పంపిణీ
కాకతీయ, ఖిలా వరంగల్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ తన సొంత ఖర్చులతో మున్సిపల్ కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు. బుధవారం తూర్పు కోట పోచమ్మ దేవాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్‌లో పనిచేస్తున్న 40 మంది మున్సిపల్ కార్మికులకు ఈ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సువర్ణ సురేష్ మాట్లాడుతూ… కాలనీల పరిశుభ్రత కోసం ప్రతిరోజూ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు అమూల్యమని అన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించిన సఫాయి కార్మికుల త్యాగాన్ని ఆయన గుర్తు చేశారు.డివిజన్‌లో పనిచేస్తున్న కార్మికుల్లో అధిక సంఖ్యలో క్రైస్తవులు ఉన్నందున, వారి ప్రధాన పండుగ అయిన క్రిస్మస్ సందర్భంగా గత నాలుగేళ్లుగా నూతన వస్త్రాలను కానుకగా అందిస్తున్నామని, ఈ ఏడాదితో ఐదో సంవత్సరం పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అఖిలపక్ష నాయకులు, స్థానిక యువకులు పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్మికులు ఈ సందర్భంగా కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


