యూరియా కొరతపై చర్చ పెట్టండి
సభలో వాయిదా ప్రతిపాదన ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రైతుల ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై తక్షణమే శాసనసభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం శాసనసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. యాసంగి (రబీ) సీజన్‌లో రైతులు యూరియా లభ్యత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు సభ దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ కె. సంజయ్లు ఈ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రైతు సమస్యలపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు.
అసెంబ్లీలో నిరసన
ఈ సందర్భంగా అసెంబ్లీ హాల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ “కాంగ్రెస్ వచ్చింది.. రైతులను నిండా ముంచింది” అంటూ నినాదాలు చేశారు. షాపుల్లో దొరకని యూరియా యాప్‌లలో ఎలా దొరుకుతుందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు యూరియా నిల్వలను ముందస్తుగా సమకూర్చడంలో విఫలమయ్యాయని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. సరఫరా లోపాల వల్ల రైతులు అరిగోస పడుతున్నారని, సాగు పనులు నిలిచిపోతున్నాయని తెలిపారు. ఇదే అంశంపై గతంలో డిసెంబర్ 31, 2025న దుబ్బక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించగా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ సంబంధిత నియోజకవర్గానికి 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు.


