అల్ఫోర్స్‌లో విపత్తు నిర్వహణ శిక్షణ శిబిరం
కాకతీయ, కరీంనగర్: తొమ్మిదవ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో నిర్వహించిన యువ ఆపద మిత్ర పథకం శిక్షణ శిబిరంలో భాగంగా విపత్తు నిర్వహణపై అవగాహన కార్యక్రమం జరిగింది.విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి, బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ ఏ.కే. జయంత పాల్గొని కెడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. విపత్తు నిర్వహణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని, అప్రమత్తతతోనే ప్రాణనష్టం, ఆస్తినష్టం తగ్గించవచ్చని తెలిపారు.విపత్తులు ఎప్పుడు, ఎక్కడ సంభవించినా తక్షణ స్పందనతో సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైన వనరులను సమకూర్చి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ఈ అంశంపై అవగాహన కలిగిన వారు ఇతరులకు తెలియజేస్తూ సమాజంలో చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు.
కెడెట్లకు ప్రాయోగికంగా శిక్షణ ఇచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు నిర్వహించారు. విపత్తు సమయంలో చేపట్టాల్సిన చర్యలను ప్రత్యక్షంగా చూపిస్తూ అవగాహన కల్పించారు. కెడెట్లు ప్రదర్శించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
జిల్లా అగ్నిమాపక అధికారి రాజ్‌కుమార్, ఏఎస్ఐ మహేందర్, డీవీఆర్ ఆపరేటర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చివరగా విపత్తు సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేయించారు.


