తుదిదశలో ‘అనులేఖ’కు నిరాశ
చివరి దశలో చేజారిన ఎనఎస్‌యూఐ అధ్యక్ష పదవి
ఫైనల్ లిస్టులో చోటు దక్కినా హైకమాండ్ నిర్ణయంలో మార్పు
రాజస్థాన్ దళిత నేత వినోద్ జఖాడ్‌కు బాధ్యతలు
వరుసగా రెండోసారి నిరాశలో తెలంగాణ యువనేత
కాకతీయ, న్యూఢిల్లీ : కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకురాలు అనులేఖ బుసకు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎనఎస్‌యూఐ) జాతీయ అధ్యక్ష పదవి తుదిదశలో చేజారింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థలో కీలకమైన ఈ పదవికి నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో చివరి వరకు పోటీలో నిలిచినప్పటికీ, చివరికి రాజస్థాన్‌కు చెందిన దళితవర్గ నేత వినోద్ జఖాడ్‌కు హైకమాండ్ అవకాశం కల్పించింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ఇంటర్వ్యూలలో దేశవ్యాప్తంగా 15 మంది నేతలను పరిశీలించగా, చివరి దశలో ముగ్గురిని ఎంపిక చేశారు. ఆ ముగ్గురిలో తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అనులేఖ బుస కూడా ఉండటం విశేషం. మహిళ, ఓబీసీ కోటా అంశాలు తనకు అనుకూలిస్తాయని భావించినప్పటికీ, సామాజిక సమీకరణాల దృష్ట్యా హైకమాండ్ వినోద్ జఖాడ్ వైపు మొగ్గుచూపింది. ఇదే పదవికి గతంలో కూడా తుదిదశలో చేరిన అనులేఖకు వరుసగా రెండోసారి నిరాశ ఎదురైంది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యత కలిగిన బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కరీంనగర్ జిల్లా ప్రస్తుతం అనులేఖ ఎనఎస్‌యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ, కేరళ రాష్ట్ర ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అనులేఖ, విద్యార్థి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా ఆమె పాల్గొని ప్రత్యేక గుర్తింపు పొందారు.
అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన తెలంగాణ యువనేత
ఇదిలా ఉండగా, అంతర్జాతీయ రాజకీయ నాయకత్వ శిక్షణ కార్యక్రమానికి అనులేఖ బుస ఎంపిక కావడం మరో విశేషం. కొన్రాడ్ అడెనౌర్ స్కూల్ ఫర్ యంగ్ పొలిటిషయన్స నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ముగ్గురు ఎంపిక కాగా, కాంగ్రెస్ నుంచి అనులేఖ ఒక్కరే ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆసియా దేశాల యువ రాజకీయ నాయకులతో కలిసి ప్రజాస్వామ్యం, పరిపాలన, విధానాల రూపకల్పనపై శిక్షణ పొందనున్నారు. తొలి దశలో ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఫిలిప్పీన్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం శ్రీలంక సహా ఇతర దేశాల్లో కూడా పర్యటించనున్నారు. జాతీయ అధ్యక్ష పదవి చేజారినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఎంపిక కావడం అనులేఖ రాజకీయ ప్రస్థానానికి కొత్త దిశగా భావిస్తున్నారు.


