బీడి నిప్పుతో వికలాంగుడి దుర్మరణం
మంచంపైనే సజీవ దహనం
బీడి పూర్తిగా ఆర్పకపోవడంతో ప్రమాదం
పక్షవాతం కారణంగా తప్పించుకోలేక మృతి
మల్కపేటలో విషాద ఘటన.. కేసు నమోదు
కాకతీయ, ఆత్మకూరు : బీడి నిప్పుతో వికలాంగుడు సజీవదహనం అయిన విషాద ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం మల్కపేట గ్రామంలో చోటుచేసుకుంది. బీడి తాగి పూర్తిగా ఆర్పకుండా పడుకోవడంతో మంటలు వ్యాపించి మంచంపైనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మకూరు సీఐ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కపేట గ్రామానికి చెందిన గుండెబోయిన కృష్ణమూర్తి (60) గురువారం తెల్లవారుజామున తన ఇంట్లో మృతిచెందిన స్థితిలో కనిపించాడు. రాత్రి సమయంలో బీడి తాగిన అనంతరం దానిని పూర్తిగా ఆర్పకుండా మంచంపై పడుకోవడంతో నెమ్మదిగా మంటలు వ్యాపించాయి. ముందుగా బట్టలకు, అనంతరం మంచానికి మంటలు అంటుకోవడంతో కృష్ణమూర్తి సజీవదహనం అయ్యాడు.

పక్షవాతం కారణంగా తప్పించుకోలేకపోయాడు
కృష్ణమూర్తికి గతంలో పక్షవాతం రావడంతో స్వయంగా కదలలేని పరిస్థితి ఏర్పడింది. మంటలు వ్యాపించిన సమయంలో బయటకు రావడానికి లేదా సహాయం కోసం ప్రయత్నించలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సంతోష్ తెలిపారు. ఈ ఘటనలో ఎస్సై తిరుపతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


