ఎర్రకోట బ్లాస్ట్ మాడ్యూల్‌కి పీఓకే నుంచి డైరెక్షన్స్.. దర్యాప్తులో సంచలనాలు!
ఎర్రకోట బ్లాస్ట్ వెనక బయటపడ్డ అంతర్జాతీయ ఉగ్ర జాలం
పీఓకే–అఫ్గాన్ హ్యాండ్లర్లే మాస్టర్మైండ్స్
జైషే మహ్మద్ లింకులు బట్టబయలు
కాకతీయ, నేషనల్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో భద్రతా వ్యవస్థలు అలర్ట్ అయ్యాయి. మొదట సాధారణ బ్లాస్ట్‌లా కనిపించినా, దర్యాప్తు లోతుకు వెళ్తే విదేశీ ఉగ్రజాలం తెర మీదకి వచ్చింది. ఈ బ్లాస్ట్ వెనక ఉన్న నెట్‌వర్క్ కేవలం దేశీయంగానే కాకుండా, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), అఫ్గానిస్థాన్‌లో ఉన్న హ్యాండ్లర్లు నడిపిన ఆపరేషన్‌గా అధికారులు నిర్ధారించారు.
దర్యాప్తు ఏజెన్సీలు ట్రేస్ చేసిన డిజిటల్ కమ్యూనికేషన్ ప్రకారం, ఎర్రకోట బ్లాస్ట్ మాడ్యూల్‌కు పీఓకేలో ఉన్న ఫైజల్ ఇష్ఫాక్ భట్, అఫ్గానిస్థాన్‌లో ఉన్న డాక్టర్ ఉకాసా అనే ఇద్దరు టాప్ హ్యాండ్లర్ల నుంచి నేరుగా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. వారి సూచనల మేరకే బ్లాస్ట్ ప్లానింగ్, అమలు జరిగిందని విచారణాధికారులు వెల్లడించారు. అదేవిధంగా, మూడో హ్యాండ్లర్ హషీమ్ కూడా టెలిగ్రామ్ ద్వారా మాడ్యూల్ సభ్యులతో నిరంతరంగా సంప్రదింపులో ఉన్నట్లు ఆధారాలు గుర్తించారు. ఈ ముగ్గురు కలిసి దేశంలో పెద్ద మోడ్యూల్ రూపొందించేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.
ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన డాక్టర్ ఉమర్ నబీతో పాటు మరికొందరు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో ప్రత్యక్ష లింకులు కలిగి ఉన్నట్టు దర్యాప్తు నిర్ధారించింది. గతంలోనూ ఈ నెట్‌వర్క్ పీఓకే నుంచి భారతదేశంపై ఉగ్ర దాడులకు ప్రయత్నించిన రికార్డులు ఉన్నాయి. ఇకపోతే దర్యాప్తులో బయటపడిన మరో షాకింగ్ అంశం.. ఈ ఆపరేషన్‌కు వచ్చిన ఆర్థిక సహాయం. పీఓకే నుంచి హవాలా మార్గంలో ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆధారాలు లభించాయి.
అలాగే ఆన్‌లైన్ క్రిప్టో వాలెట్ల ద్వారా చిన్న మొత్తాలుగా డబ్బులు పంపిన సమాచారం దొరికింది. వాటిని విడమరచి చూస్తే, మొత్తం ప్లానింగ్ అనేది బాగా స్ట్రక్చర్డ్‌గా ఉందని ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. వీరు టెలిగ్రామ్ ఛానెల్స్, కోడ్‌వర్డ్ మెసేజ్‌లు, వర్చువల్ సిమ్‌లు, VPNలు ఉపయోగించి కమ్యూనికేషన్ జరిపినట్లు ఆధారాలు చెబుతున్నాయి. విచారణలో స్వాధీనం చేసిన పరికరాల్లో బర్న్ చాట్‌లు, వర్చువల్ సిమ్‌లు, VPN ట్రైల్స్ కనిపించడంతో ఇది ప్లాన్‌డ్ ఇంటర్నేషనల్ టెర్రర్ ఆపరేషన్ అని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎర్రకోట పేలుడు వెనుక ఉన్న అంతర్జాతీయ టెర్రర్ లింకులు బయటపడటంతో, కేసు మరింత సీరియస్ మలుపు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే దేశ భద్రతా వ్యవస్థలు ఇప్పుడు ఈ నెట్‌వర్క్ కి భారత్‌లో ఉన్న స్లీపర్ సెల్స్‌ను గుర్తించడంపై దృష్టి సారించాయి.


