ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీపై దిగ్విజయ్ ప్రశంసలు
మోదీ ఎదుగుదల ఫోటోను సోషల్ మీడియాలో షేర్
రాహుల్ గాంధీకి అంతర్లీన సందేశమా?
బీజేపీకి అస్త్రంగా మారిన వ్యాఖ్యలు
కలకలం రేపుతున్న దిగ్విజయ్ సింగ్ కామెంట్స్
కాకతీయ, నేషనల్ డెస్క్ : సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ సంస్థాగత వ్యవస్థను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ఎదుగుదలకు సంబంధించిన పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా దిగ్విజయ్ సింగ్ కొత్త రాజకీయ దుమారాన్ని రేపారు. 1990ల నాటి ఫోటోలో అప్పటి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ సమక్షంలో నేలపై కూర్చున్న యువ మోదీ కనిపిస్తారు. ఈ ఫోటోను ఉదాహరణగా చూపుతూ, ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ వ్యవస్థలో గ్రాస్‌రూట్ కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధాని స్థాయికి ఎదగగలరని ప్రశంసించారు. “ఇది సంస్థ శక్తి” అంటూ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థపై ప్రశంసలు
“ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు, జనసంఘ్ కార్యకర్తలు నేలపై కూర్చునే స్థాయి నుంచి ముఖ్యమంత్రి, ప్రధాని స్థాయికి ఎదగడం ఆ సంస్థ బలాన్ని చూపిస్తుంది” అని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండగా, పార్టీ అధిష్ఠానం మౌనంగా ఉంది. ఈ పోస్టులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు కీలక నేతలను ట్యాగ్ చేయడం గమనార్హం. దీంతో ఇది పార్టీ అధిష్ఠానానికి ఉద్దేశించిన సంకేతమా అనే చర్చ మొదలైంది. దిగ్విజయ్ వ్యాఖ్యలను బీజేపీ తనకు అనుకూలంగా మలచుకుంది. బీజేపీ నేతలు స్పందిస్తూ, కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, కుటుంబ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. “దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ వాస్తవ స్వరూపాన్ని బయటపెట్టాయి” అంటూ విమర్శలు గుప్పించారు.
వివాదం ముదిరిన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ స్పష్టీకరణ ఇచ్చారు. తాను సంస్థాగత బలాన్ని మాత్రమే ప్రశంసించానని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు తాను వ్యతిరేకమేనని తెలిపారు. అయినప్పటికీ, కాంగ్రెస్‌లో సంస్కరణల అవసరాన్ని గతంలో ప్రస్తావించిన దిగ్విజయ్ వ్యాఖ్యలు, పార్టీ అంతర్గత రాజకీయాలకు కొత్త మలుపు తిప్పినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యసభ పదవీకాలం ముగింపు సమీపిస్తున్న వేళ, ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశముందని చర్చ సాగుతోంది.


