రూ.12కోట్లు వచ్చాయా?
వరద బాధితులకు ఎప్పుడిస్తారు?
ప్రజలు, అధికారుల్లో సందేహాలు!
అసలు నిధులు వచ్చాయా.. వస్తాయా? ఎప్పుడొచ్చాయంటున్న బల్దియా అధికారులు
కాకతీయ, వరంగల్: ముంథా తుఫానుతో వరంగల్ అతలాకుతలమైంది. ముఖ్యంగా హన్మకొండలోని గోపాల్పూర్ లో గల చెరువు కట్ట తెగి తీవ్ర నష్టం కలిగింది. ముంపుతో ఒక్కో ఇంటికి లక్ష నుంచి నాలుగైదు లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ వరద బాధితులకు ప్రభుత్వం ఇంటికో రూ.15వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. అందుకు గాను రూ.12కోట్లు విడుదల చేసినట్లు స్వయంగా మేయర్ గుండు సుధారాణి శుక్రవారం ప్రకటించారు. దీంతో ఆ డబ్బులు ఎప్పుడిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరదలు వచ్చి ఇప్పటికీ నెల రోజులు కావస్తున్నా బాధితులకు ఎలాంటి పరిహారం అందలేదు. ఈ విషయమై స్థానికులు ఆందోళనలు కూడా చేపట్టారు. తాజాగా, ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని మేయర్ పేర్కొనడంపై ముంపు బాధితుల్లో హర్షం వ్యక్తమవుతున్నా.. వాటి పంపిణీ ఎప్పుడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విడుదలైన రూ.12కోట్లు ఏ ప్రాతిపదికన బాధితులకు అందిస్తారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వం చెప్పినట్లు ఇంటికి రూ.15వేలు ఇస్తారా? నష్టం అంచనాలకు అనుగుణంగా వాటిని పంచుతారా? లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రూ.12కోట్లు ఎప్పుడొచ్చాయని బల్దియాకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందా? విడుదల చేస్తామని పేర్కొందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై బల్దియా మేయర్ లేదా కమిషనర్ లేదా అధికారులు వాస్తవ వివరాలు వెల్లడించడంతోపాటు నిధుల విడుదలకు సంబంధించిన జీవోను బహిర్గతం చేస్తే బాగుంటుందని ముంపు బాధితులు కోరుతున్నారు.


