తప్పు జరిగిందా శ్రీరామా..!!?
సీజ్ చేసిన కలప మాయం..?!
ములుగు జిల్లా అటవీశాఖలో కలకలం
వేరే శాఖలోకి వెళ్తూ..వెళ్తూ అధికారి కలప స్కాం
లక్షల విలువ చేసే కర్రను సొంతిట్లో దాచేసిన అధికారి
ఆరోపణలు రావడంతో నామమాత్రంగా విచారణ
ఆ తర్వాత గప్ చూప్.. ఇప్పటికీ అధికారి ఇంట్లోనే అక్రమంగా నిల్వ
స్వాధీనం చేసుకోకుండా మీన మేషాలు
జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారుల వైఖరిపై పెరుగుతున్న అనుమానాలు
ములుగు జిల్లాకు సమీపంలో రేంజ్ ఆఫీసర్‌గా పనిచేసిన అధికారి
ఇటీవలే మరో కనక వర్షం కురిపించే మరో శాఖలో పోస్టింగ్
అటవీ అధికారిగా ఉన్నప్పుడు అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహారించిన వైనం

కాకతీయ, నిఘా ప్రతినిధి : ములుగు అటవీశాఖలో కలప మాయం కలకలం రేపుతోంది. అక్రమ రవాణా కేసులో స్వాధీనం చేసుకున్న లక్షల రూపాయల విలువైన కలప గల్లంతైందన్న ఆరోపణలు చర్చకు దారి తీస్తున్నాయి. అధికారిక రికార్డుల్లో సీజ్ చేసినట్లు నమోదు ఉన్నప్పటికీ, ఆ కలప మొత్తం డిపోలో అందుబాటులో లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లాకు సమీపంలోని ఒక రేంజ్‌లో పనిచేసిన అధికారి విధుల్లో ఉన్న సమయంలో స్వాధీనం చేసిన కలపలో కొంత భాగాన్ని అధికారిక గోదాములో కాకుండా తన సొంతింట్లోనే నిల్వ ఉంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడంతో శాఖలో అంతర్గత చర్చలు జోరందుకున్నాయి. అయితే బహిరంగంగా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం సందేహాలకు తావిస్తోంది.
సీజ్ చేసిన కలపపై సందేహాలు
అటవీ సిబ్బంది కలపను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ డిపోలో ఉన్న నిల్వ పరిమాణం, సీజ్ జాబితాలో ఉన్న పరిమాణంతో సరిపోలడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజ్ చేసిన కలపలో కొంత భాగం సంబంధిత అధికారి నివాసంలోనే ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇది నిజమైతే అధికార దుర్వినియోగానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా స్వాధీనం చేసుకున్న వస్తువులను వ్యక్తిగతంగా దాచుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆరోపణలు వెలుగులోకి రాగానే ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం. కానీ ఆ విచారణ ఫలితం ఏంటన్నది ఇప్పటివరకు వెల్లడించలేదు. కలపను తిరిగి స్వాధీనం చేసుకోవడంపై కూడా స్పష్టత లేదు. దీంతో శాఖ వైఖరిపై అనుమానాలు పెరుగుతున్నాయి.
మరో శాఖకు అధికారి జంప్..
ఇదిలా ఉండగా సంబంధిత అధికారి ఇటీవలే మరో శాఖకు బదిలీ అయినట్లు తెలుస్తోంది. కీలక సమయంలో బదిలీ జరగడం, ఆ తర్వాత వ్యవహారం స్తబ్దుగా మారడం యాదృచ్ఛికమా అన్న చర్చ సాగుతోంది. అటవీ అధికారిగా ఉన్న సమయంలో “అంతా నా ఇష్టం” అన్నట్లుగా వ్యవహరించాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారుల మౌనం పరిస్థితిని మరింత సందిగ్ధంలోకి నెట్టింది. సీజ్ వివరాలు, నిల్వ వివరాలు, విచారణ పురోగతిపై పారదర్శకంగా సమాచారం ఇవ్వాలని ప్రజా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. సీజ్ చేసిన కలప పూర్తిగా డిపోలో ఉందా? అధికారి ఇంట్లో నిల్వ ఉందన్న ఆరోపణల్లో నిజమెంత? విచారణ నివేదిక ఎప్పుడు వెలుగులోకి వస్తుంది? బాధ్యులపై చర్యలు ఉంటాయా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ములుగు అటవీశాఖలో కలప మాయం వ్యవహారం ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. స్పష్టత రాకపోతే శాఖ ప్రతిష్ఠకే మచ్చ పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


